Thursday, October 8, 2009

ఈ ప్రశ్నకు బదులేదీ ?


జరజర మంటూ పరుగులు పెడుతూ...
బిరబిర మంటూ నట్టింటను చేరి...
కంటి ముందరే మా యింటిని కూల్చి...
మా బ్రతుకు పుట్టెను నట్టేట ముంచే...
కాళరాత్రిలో కరాళ నృత్యం ...!
కృష్ణవేణమ్మే చేసె ఈ అకృత్యం ...!!

ఇన్నాళ్ళూ మా దప్పిక తీర్చి ...
మా పంటకు జవజీవాన్నిచ్చి...
మా బతుకుని మింటకు చేర్చి...
కన్నతల్లిలా మము ఏమార్చి...
ఎందుకమ్మా ఇంత దారుణం చేశావ్ ?
అర్ధాంతరంగా మా బతుకులనే మింగేశావ్ ?

మా శోకం చూసి నీ కోపం ఆగిందా ?
మా కడుపు కోతకు నీ కక్ష తీరిందా ?
కన్నతల్లి కరుణకు కాలం చెల్లిందా ?
'అమ్మా' అనే పిలుపుకు అర్ధమే మారిందా ?


(కృష్ణవేణమ్మ జల ప్రళయ విలయ తాండవానికి... సర్వం కోల్పోయిన అనాధల గుండె లోతుల్లోని ప్రతిధ్వనికి... బాదాతప్త హృదయంతో అక్షర ఆక్రోశం...)

Friday, August 21, 2009

అంబరమంటే సంబరం...!

హిమాలయుని కెందుకే అంత వేడి...?
ఉన్నతిలో తన కంటే ఎంతో ఎత్తుకు ఎదిగాడని...!

సముద్రుని కెందుకే ఎగసిపాటు ...? కోట్ల జనుల హృదయసంధ్రాల్లో ఈదురాడుతున్నాడని...!

చందురుని కెందుకే అంత వెలుగుమంట ?
మనసులను రంజింపచేయటంలో తననే మించినాడని...!

కోయిల ఎందుకే అలా మూగబోయింది...?
ఆతని పలుకులకే ఆమని పులకరిస్తుందని...!

నెమలి ఎందుకే అలా కుములుతుంది...?
ఆతని నడకలలోనే నాట్యం దాగివుందని...!

వర్షఋతువుని చూసి వసంతానికెందుకే అంత ఈర్ష్యా ...?
జగానికి జనహర్షుని అందించే అదృష్టానికి నోచుకుందని...!

జనుల కేందుకే యింత అంబరమంటే సంబరం ...?
జగదేక వీరుని జన్మ దినోత్సవం ... అందుకే జగమంతా ఆనందోత్సవం ...!

ఎవరే ప్రకృతి ఆకృతినే మార్చిన ఆ పురుష పుంగవుడు...?
ఆంధ్ర ప్రజల ఆరాధ్య దేవుడు ... అంజనీ పుత్రుడు...!

వేధింపకే..! పేరూ, వూరూ చెప్పి పుణ్యం కట్టుకోవే...??
మెగాస్టార్ చిరంజీవి నామధేయం..! నెలవు జన హృదయం ...!!

Wednesday, August 19, 2009

కన్యాశుల్కం

మహాకవి, అభినవాంథ్ర సాహితీ వైతాళికుడు శ్రీ గురజాడ అప్పారావు గారిచే రచించబడిన గొప్ప నాటకం ' కన్యాశుల్కం ' ఆనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆచారా వ్యవహారాలపై, సాంఘిక దురాచారాలపై గురజాడ వారు 1892 వ సంవత్సరంలో సంథించిన వ్యంగ్యాస్త్రం 'కన్యాశుల్కం.' గురజాడ వారికి అఖండ ఖ్యాతి నార్జించిపెట్టిన ఆ నాటకాన్ని శ్రీ డి.యల్ గారు అదే పేరున చలన చిత్రంగా నిర్మించారు. దీనికి ప్రఖ్యాత దర్శకులు శ్రీ పి.పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. నాటకాన్ని సినిమాకు అనువాదం చేసి తగు మాటలందించింది శ్రీ వెంపటి సదా శివ బ్రహ్మం గారు, తగిన సంగీతాన్ని అందించి అలరించింది శ్రీ ఘంటశాల వెంకటేస్వర రావు గారు. 26 ఆగస్టు 1955 నాడు కన్యాశుల్కం సినిమా ఆంధ్రరాష్ట్రాన విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

సంక్షిప్త కథ..!
పద్దెనిమిది వందల రూపాయల కన్యాశుల్కానికి ఆశపడి ఆరేళ్ళైనా నిండని తన కూతురు సుబ్బిని, అరవై ఏళ్ళ ముసలాడి కిచ్చి పెళ్ళీ చేయడానికి పూనుకుంటాడు అగ్నిహోత్రావధానులు. పెళ్ళిచేసుకుంటే అదృష్టం కలిసొస్తుందన్న జ్యోతిష్యుల మాటను విశ్వసించి, చావుకళ వుట్టిపడే వయసులో, అగ్నిహోత్రావధానుల చిన కూతురిని చేసుకోవడానికి సిద్ధపడతాదు లుబ్ధావధానులు.
కమీషన్ కోసం ఈ పెళ్ళితంతుకి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు రామప్ప పంతులు. తన శిష్యుడు మరియు అగ్నిహోత్రావధానులు కొడుకైన వెంకటేషానికి వేసవి సెలవల్లో పాఠాలు చెప్పే మిషతో అగ్నిహోత్రావధనులు యింట్లో చేరతాడు గిరీశం పంతులు. అగ్నిహోత్రావధానులు పెద్ద కూతురు ,విధవ అయిన బుచ్చమ్మను లైన్లో పెట్టటానికి తెగ ప్రయత్నిస్తుంటాడు గిరీశం ఆ యింట్లో చేరి.
మేనకోడలి బ్రతుకు అన్యాయమై పోకుండా కాపాడేందుకు కంకణం కట్టుకుంటాడు అగ్నిహోత్రావధానులు బావమరిది అయిన కరటక శాస్త్రులు.
తన శిష్యుడైన మహేశానికి ఆడవేషం కట్టి, మధురవాణి సహాయం కోరతాడు కరటక శాస్త్రులు.
అగ్నిహోత్రావధానులు ఇంట్లో మకాం వేసిన గిరీశంగాని, సుబ్బీ, లుబ్ధావధానుల పెళ్ళికి వస్తే, మీకు ముప్పు తప్పదు అని సమయం చూసి హెచ్చరిస్తుంది మధురవాణి రామప్ప పంతులుని. ఆ విషయం విని భయంతో వణికిపోతాడు రామప్ప పంతులు.
సరిగ్గా అదే సమయంలో, మధురవాణి సహాయంతో రామప్ప పంతులుని కలుస్తాడు కరటక శాస్త్రులు. తనని గుంటూరు శాస్త్రులుగా పరిచయం చేసుకుని, తన కూతురి పెళ్ళి చెయ్యాలంటూ రామప్ప పంతులుని ప్రాధేయపడతాడు.
గుంటూరు శాస్త్రులు రాకని కలిసొచ్చిన అదృష్టంగా భావించిన రామప్ప పంతులు, అగ్నిహోత్రావధానుల కూతురితో, ముందుగా తను కుదిర్చిన సంబంధాన్ని చెడగొట్టటానికి యుక్తి పన్ని, ' నీకు క్షయ రోగం అంటా కదా, నీ కూతురు తిరుగుబోతు అంట కదా,నీ సంబంధం మాకొద్దు అంటూ' అగ్నిహోత్రావధానుల పేరున ఒక ఫోర్జరీ లెటరు రాసి లుబ్ధావధానులుకి పంపిస్తాడు.
ఆ వుత్తరాన్ని చేతబుచ్చుకుని నెత్తీ-నోరూ బాదుకుంటూ రామప్ప పంతులు వద్దకు వస్తాడు లుబ్ధావధానులు. 'పోతే పోయింది దిక్కుమాలిన సంబంధం ' అంటూ అప్పటికప్పుడు అగ్నిహోత్రావధానులు గారి సంబంధాన్ని తెగతెంపులు చేసి, గుంటూరు శాస్త్రులు సంబంధాన్ని, లుబ్ధావధానులుకి ముడిపెట్టేస్తాడు రామప్ప పంతులు.
తన భధ్యత అంటూ రామప్ప పంతులు, లుబ్ధావధానులు తరుపున మధురవాణి మెడలోని కంఠాభరణాన్ని తీసుకుని వచ్చి, లుబ్ధావధానులు చేతిలో పెట్టి, గుంటూరు శాస్త్రులుకి ఇప్పించి సంబంధాన్ని ' తథాస్తు ' అనిపిస్తాడు .

రామప్ప పంతులు లేకుండా చూసి అసలు ముహూర్తం కంటే ముందుగా, మధుర వాణి సహాయంతో, తన శిష్యుడికీ,లుబ్ధావధానులుకి పెళ్ళీ జరిపించేస్తాడు కరటక శాస్త్రులు .
అదే రాత్రి ఆదమరచి నిద్రబోతున్న లుబ్ధావధానులు పైకి అటక మీదనుంచి వురికి, 'నీ కొత్త పెళ్ళాం పాత మొగిడినీ, దెయ్యాన్నీ ' అంటూ లుబ్ధావధానులుని భయబ్రాంత్రులకి గురిచేసి, శిష్యుడితో సహా పారిపోతాడు కరటక శాస్త్రులు.
బ్యాండుమేళంతో సహా వచ్చిన రామప్ప పంతులు జరిగింది తెలుసుకుని, తన కమీషన్ దక్కనందుకు వీరావేశంతో వూగిపోతూ, మధుర వాణి యిచ్చిన కంఠాభరణాన్ని యిమ్మని అడుగుతాడు లుబ్ధావధానులుని. అసలే దెయ్యం గొడవతో పిచ్చెక్కి వున్న లుబ్ధావధానులు ఆ వస్తువతో తనకేం సంబంధం లేదు పొమ్మటాడు.
ఆభరణం తేకుండా ఇంట్లోకి రావద్దని రామప్ప పంతులు మొహాన్నే తలుపులేసేస్తుంది మధుర వాణి.
******
ఇక్కడ జరుగుతున్న బాగోతం అసలేం తెలియని అగ్నిహోత్రావధానులు మందీ,మార్బలంతో కూతురు పెళ్ళికి బయలు దేరతాడు.
సందట్లో సడేమియా అన్నట్లు బుచ్చమ్మను లేవదీసుకుపోవడానికి ప్లాన్ వేస్తాడు గిరీశం. తను లేచిపోతే చెల్లెలి పెళ్ళి తప్పిపోతుందన్న నమ్మకంతో గిరీశంతో లేచిపోయి అతడిని పెళ్ళి చేసుకోవడానికి సిద్దపడుతుంది బుచ్చమ్మ.
రోడ్డున పడి వూరు దాటి పోతున్న రామప్ప పంతులుకి, అగ్నిహోత్రావధానులు, అతని పెళ్ళి బృందం తారసపడుతుంది. జరిగిన తంతులో తన పాత్ర ఏమి లేనట్టూ, లుబ్ధావధానులు తక్కువ కన్యాశుల్కానికి కక్కుర్తి పడి మరో పెళ్ళి చేసుకున్నట్టు, తద్వారా అగ్నిహోత్రావధానులుని వెర్రివెధవని చెసినట్టూ రెచ్చగొడుతూ చెబుతాడు రామప్ప పంతులు అగ్నిహోత్రావధానులుకి.
అగ్నిహోత్రావధానులు ఆగ్రహోదగ్రుడై, లుబ్ధావధానులుని చితక బాది వస్తాడు. కూతురిని లేవదీసుకుపోయిన గిరీశం పై పోలీసు కంప్లైంట్ యివ్వడానికి అగ్నిహోత్రావధానులుతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన రామప్ప పంతులు,వూరుకోకుండా, కొత్తగా పెళ్ళి చేసుకున్న అమ్మాయిని, లుబ్ధావధానులు మర్డర్ చేసాడని వూరంతా అనుకుంతుందనీ, ఇనస్పెక్టర్ చెవిలో వూది, లుబ్ధావధానులు మెడకి ఉచ్చు తగిలించే ప్రయత్నం చేస్తాడు.
బుచ్చమ్మను పెళ్ళి చేసుకునేందుకు లాయర్ సౌజన్యరావు పంతులు గారి సహాయాన్ని పొందేందుకు వారి యింటికి వెళ్ళతాడు గిరీశం. నంగనాచి మాటలతో ఆయన వద్ద మెప్పు పొందే సమయంలో , మధురవాణి అక్కడకు రావడంతో గిరీశం బండారం బయటపడుతుంది. " డామిట్ కథ అడ్డం తిరిగింది " అని కసిగా తిట్టుకుంటాడు గిరీశం.
డబ్బుకు ఆశపడి పెళ్ళికి తలొగ్గినందుకు తగిన శాస్తే జరిగిందని విలపిస్తూ , రక్షించమని లాయర్ సౌజన్యరావు గారిని ఆశ్రయిస్తాడు లుబ్ధావధానులు.
జరిగిందంతా సౌజన్యరావు గారికి వివరించి లుబ్ధావధానులు గారిని రక్షించమని, గిరీశాన్ని వదిలేస్తే మరో వంద మంది బుచ్చమ్మలని పాడుచేస్తాడని,అలా కాకుండా వారికి పెళ్ళి చేస్తేనే మంచిదని, బుచ్చమ్మకూ,గిరీశానికి పెళ్ళి జరిపించమని వేడుకుంటుంది మధురవాణి.
మధురవాణి వృత్తినీ, ప్రవృత్తిని తెలుసుకున్న లాయర్ సౌజన్యరావు గారు ఆమెను అభినందించి ఆమెకు భగవధ్గీతను బహుకరిస్తాడు.
సౌజన్యరావు గారి సమక్షం లోనే గిరీశం బుచ్చెమ్మల పెళ్ళి జరుగుతుంది. పోలీసులతో వచ్చిన అగ్నిహోత్రావధానులుకి కనువిప్పు కలుగుతుంది.
ఆ పెళ్ళికి ఏర్పాటు చేసిన కచేరీలో గంతులేస్తున్న తన కొత్త పెళ్ళాం కనిపించేసరికి, పోయిన ప్రాణం తిరిగివస్తుంది లుబ్ధావధానులుకి. గుంటూరు శాస్త్రులు వేషంలో తను చేసిన మోసాన్ని అందరికీ తెలియచేస్తాడు కరటక శాస్త్రులు.
జరిగిన నగుబాటుతో బుద్ధితెచ్చుకున్న లుబ్ధావధానులు తన ఆస్తిలో సగభాగం తనని పెళ్ళాడిన మహేశానికి ,మిగతా సంగం ధర్మ సంస్థలకీ యిచ్చేందుకు సిద్దపడతాడు.
అగ్నిహోత్రావధానులు కూతురు సుబ్బిని మహేశానికి యిచ్చి పెళ్ళి చేయాలనుకోవటంతో కధ సుఖాంతమౌతుంది.
శుభం ...

Sunday, November 30, 2008

అశ్రు నివాళి...!!!

కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకులు...
కట్టుకున్న దాన్ని నట్టేటముంచే ద్రోహులు...
మతం మత్తులో ఉన్మత్తులు...
విద్రోహుల చేతిలో తొత్తులు..
పొరుగువాడి ఉన్నతిని కాంచలేని గుణం...
మతం పేరున జరుపుతుంది మారణహోమం ...
మతోన్మాదానికిదే నిలువెత్తు దర్పణం...
ముంబై నగరిపై లష్కరే ముష్కురుల దారుణం...
నా...
భరతమాత ముద్దుబిడ్డల దీక్షా కంకణం...
దుష్టశక్తులపాలిట అయ్యింది మృత్యువాహనం...
దేశం కొసం ప్రాణాల్నర్పించిన వీరులు ...
జాతి గుండెల్లో కలకాలం నిలిచిపోయే అమరులు...
అశృనయనాలతో,బాధాతప్త హృదయంతో...
వారికివే నా అక్షర నివాళి..
జై జవాన్... ! జై జై జవాన్..!!

Saturday, November 29, 2008

ముంబై మారణ హోమం...!

నాడు తల్లి పాలు తాగి రొమ్ము పిసికిన ఉన్మాది...
నేడు మతం పేరున మారణ హోమం చేస్తున్న ఉగ్రవాది...
దుర్మార్గంతో బతకమని ఏ మతం చెప్పింది... ?
దుష్కర్మలే జిహాదని ఏ హితం నేర్పింది... ?
పరమత సహనం లేని మానసిక మూఢులు..
జనహతమే మతమనుకొని చేయున్నయ్యా దాడులు...
మతం ముసుగులో ముష్కురుల ఇష్టా రాజ్యం...
రాక్షస కృత్యాలతో ఏర్పడుతుందా ఇస్లాం రాజ్యం... ?
ఓ... అల్లా...!
ఈ... మంద భాగ్యులకు నవ్య క్రాంతి పొసగు...!!
మా... ప్రపంచానికి శాంతి - సుఖాల నొసగు...!!!

Saturday, November 22, 2008

నా ఆత్మ - హత్య...!

రోడ్డున వేసిన రాముని బొమ్మకు పదిపైసలివ్వని దాతలు...
కర సేవంటూ వేసుకుందురు, మత మూడత్వపు వాతలు...
సర్వాంతర్యామి అయిన దేవుడు అయోధ్యలోనేనా వుంది...
ఎలా అయినావయ్యా దేవుడా..! వీళ్ళ చేతుల్లో బందీ... ?

కులమూ మతమూ మత్తునిచ్చు సారా...
సేవించు చుందురు రాజకీయ ఉన్మత్తులు మనసారా...
మనుషులు కుళ్ళి కంపు కొడుతున్నా మాటల్లో సుగంధి...
నీవు పుట్టిన చోటే రక్తపుటేరులు కాంచవయ్యా ఓ జాతిపిత గాంధీ...!

ఓ దేవుడా ...ఓ మానవుడా ...కనిపించరు మీరు మాకు...
ఈ రాజకీయ నపుంసకుల ఏలుబడిలో ...
మనసు చంపుకుని బ్రతకాలని లేదు నాకు...
అందుకే....... నా ....ఆత్మ...హత్య.......!!!